Friday 26 April 2013

చాలా రోజుల తరువాత చూసిన పాత జ్ఞాపకాలు .మా చిన్నప్పటి రోజులు 

గుర్తుకు వచ్చాయి .
సంప్రదాయం సంక నాకించి , పరాయి సంస్కృతి లో పయనించే 
పిచ్చికుంకల రాజ్యంలో నేను ఇమడలేకపోతున్నాను.
 సరిపోయే సహనాన్ని ప్రసాదించమని భగవంతుడిని వేడుకొంటున్నాను.
 పరమత సహనమే పనికిరాని సమాజంలో ,
 అనురాగం , ఆప్యాయత లు ఆవిరైన చోట దుర్భిణిలో సైతం జాడ దొరకని ప్రేమ .
విస్తు పోయే వస్తు ప్రపంచం లో పస్తులుండే పతితులెందరో ??
మగాడు మృగాడైన చోట మానవత్వం మసిమచ్చై మిగిలింది.
ఓ ప్రభుత్వమా భ్రూణ హత్యలకు అనుమతులివ్వండి .
కని , పెంచి , కనికరమైనా లేని కర్కశుల చేతుల్లో ఛిద్రం కాకుండా !
కాపాడలేని చోట పుట్టుకనే బహిష్కరించుదాం .
చట్టాలు ఎన్ని  చేశామన్నది కాదు దాని చుట్టాలెంత మందో చూడండి. 
మా భవిష్యత్తులు బంగారం చేయక్కరలేదు.
ఉన్న సింగారం చెడకుంటే చాలు.
డంబాచారాలు మాని మానవులై జీవిద్దాం .
"కదిలిస్తే" కదలండి , కాపాడుకుందాం ప్రపంచాన్ని.


మొదటిసారి వ్రాసాను. సలహాలు , సూచనలు , విమర్శలు ఆహ్వానిస్తున్నాను . 
ధన్యవాదాలతో...

                మీ .. 
-----సతీష్ తాటికొండ ----

Wednesday 24 April 2013

ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు.


1. ఋషిఋణం, 2. దేవఋణం, 3. పితౄణం.


ఈ ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి. దానికి ఏంటి మార్గం? మన పెద్దలు చెప్పారు – “బ్రహ్మచర్యేణ ఋషిభ్యః” ” యజ్ఞేన దేవేభ్యః” “ప్రజయా పితృభ్యః” అని.



1. ఋషి ఋణం: బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యయనం చేయాలి. అలాగే పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.


2. దేవఋణం: యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. కనుక ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నలం అవుతాం.


3. పితౄణం: సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి. సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా! “ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః” అంటుంది వేదం. అంటే వంశపరంపరను త్రెంచవద్దు. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెపుతున్నది. యజ్ఞాలలో పంచ యజ్ఞాలు విధిగా ప్రతి మనిషీ చేయాలి. అవి దేవ, మనుష్య, భూత, పితృ, బ్రహ్మ యజ్ఞాలు.